అసెంబ్లీలో ప్రతిపక్షం గోల చేయాలి. అధికార పక్షం దానిని కట్టడి చేయాలి. ప్రతిపక్షం స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేయాలి. స్పీకర్ సహా అధికార పక్షం దానిని తిరిగి సీట్లలో కూర్చోబెట్టేందుకు రకరకాల వ్యూహాలు అనుసరించాలి. ఇది సాధారణ సంప్రదాయం. కానీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.
బడ్జెట్ పై చర్చతోపాటు అసెంబ్లీ సమావేశాలను తీసుకుంటే ప్రతిపక్షం కంటే అధికార పక్షమే ఎక్కువ గోల చేస్తున్నట్లు కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికార పక్షమే స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ప్రతిపక్షంపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అధికార పక్షమే ఆందోళన తెలుపుతోంది. ఇది గత పరిస్థితులకు పూర్తి భిన్నం.
ఇక, ప్రతిపక్షం మాట్లాడడానికి సమయం ఇవ్వడంపై దాదాపు ఒకరోజు సమయాన్ని అధికార పార్టీ వృథా చేస్తోంది. వాస్తవానికి, చర్చ జరపకుండా, గందరగోళం చేసి, అనవసర విషయాలు మాట్లాడే సమయంలో మాత్రమే అసెంబ్లీలో వివిధ పార్టీలకు ఇచ్చిన సమయాన్ని తగ్గిస్తారు. లేదా సదరు పార్టీల సభ్యులను మాట్లాడకుండా కూర్చోవాలని చెబుతారు. అర్థవంతంగా చర్చలు జరుపుతుంటే, అజెండాపైనే మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. బడ్జెట్ ప్రసంగంపై జగన్ కూడా అజెండాకే కట్టుబడి మాట్లాడుతున్నారు. ఆయన మరీ విమర్శలూ చేయడం లేదు. పక్కకూ వెళ్లడం లేదు. ఆయన పార్టీ తరఫున ఆయన ఒక్కరే మాట్లాడతానని చెబుతున్నారు. అటువంటప్పుడు ఆయనకు మరికొంత సమయం మాట్లాడే అవకాశం ఇవ్వవచ్చు. అందులో తప్పు పట్టాల్సిన సమయం లేదు.
ఉదాహరణకు, మంగళవారం దాదాపు రెండు మూడు గంటలు సమయం వృథా అయింది. కానీ, జగన్ కోరింది కేవలం పది నిమిషాలు. లేకపోతే అరగంట. మాట్లాడడానికి ఆయనకు అవకాశం ఇస్తే అరగంటతో పోతుంది. కానీ, మూడు గంటలు వృథా కాదు కదా. కానీ, అధికార పక్షం తీరును ఎండగట్టే వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా నిరోధించాలన్నది ఇక్కడ టీడీపీ వ్యూహం. ఫలితంగా, అర్థవంతంగా జరుగుతున్న సమావేశాలు కూడా రసాభాసగా మారుతున్నాయి. అజెండా నుంచి పక్కకుపోయి, నిరసనలు తెలుపుతూ, అనవసర ప్రసంగాలు చేస్తుంటే సదరు సభ్యులకు సమయం ఇవ్వడానికి నిరాకరించవచ్చు. కానీ, బడ్జెట్‌పైనే చర్చ జరిపితే నిరాకరించడంపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం విజయవంతమైంది. అధికార పక్షం వెనకడుగు వేసిందనే చెప్పాలని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు.