మన టీవీల్లో కార్యక్రమాల మధ్య ప్రకటనలకు బదులు ప్రకటనల మధ్య కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి.రెండున్నర గంటల సినిమాలో గంటన్నర ప్రకటనలు చొప్పించి నాలుగుగంటలు సాగదీస్తున్నారు. విసుగెత్తిన ప్రేక్షకుల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులమీద ట్రాయ్ దృష్టి సారించింది. ప్రకటనల వ్యవధి మీద ఒక పరిమితి ఉండాలన్న వాదనను ట్రాయ్ సమర్థించింది. గంటకు 12 నిమిషాలు మించకూడదనే షరతు విధించింది. అయితే, ఇందులో సొంత కార్యక్రమాల ప్రకటనలకు మినహాయింపు ఇవ్వాలని చానల్స్ కోరాయి. అందుకు ట్రాయ్ సరేనన్నది.అయినప్పటికీ చానల్స్ ప్రైమ్ టైమ్ లో ప్రకటనల హోరు ఎంతమాత్రమూ తగ్గించలేదు. ట్రాయ్ ఏ గంటకు ఆ గంటే 12 నిమిషాలు మించకూడదంటూ స్పష్టంగా ఆదేశాలిచ్చింది. తమ వ్యాపారావకాశాలను ట్రాయ్ అడ్డుకుంటున్నదంటూ చానల్ యాజమాన్యాలు ఫిర్యాదు చేయటంతో కొన్ని సవరణలు చేయక తప్పలేదు. అయితే, ఇప్పుడు తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం చానల్స్ తాము ప్రసారం చేసిన వాణిజ్య ప్రకటనల వ్యవధి, సొంత కార్యక్రమాల ప్రచార వ్యవధి, ప్రజాప్రయోజన ప్రకటనల వ్యవధి, టెలీమార్కెటింగ్ ప్రకటనల వ్యవధి ప్రతి మూడు నెలలకొకసారి ట్రాయ్ కి తెలియజేయాల్సి ఉంటుంది. 2012 నాటి సేవల నాణ్యతాప్రమాణాల క్రమబద్ధీకరణ నిబంధనల ప్రకారం ఇక మీదట ప్రతి మూడునెలల ముగిసిన 15 రోజుల్లోగా ఈ పట్టికను పంపాల్సి ఉంటుంది. దీనివలన చానల్స్ ఏ మేరకు నిబంధనలు పాటిస్తున్నాయీ అర్థమవుతుంది. అదేవిధంగా టెలిమార్కెటింగ్ ప్రకటనలమీద కూడా దృష్టిపెట్టేందుకు ఇది అవకాశం కలిగిస్తుంది.
