Sunday, 17 August 2014

స్థానికంగా ప్రసారమౌతున్న కేబుల్ చానల్స్ మీద నిఘా పెట్టండి - కేంద్రం ప్రభుత్వం

 స్థానికంగా ప్రసారమవుతున్నకేబుల్ చానల్స్ మీద ప్రత్యేక నిఘా పెట్టి ప్రసారాంశాలమీద ఎప్పటికప్పుడు నివేదించాలని సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రప్రభుత్వాలనూ కోరింది. రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలలోనూ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటుచేసి వాటి సాయంతో ఆ చానల్స్ అన్నీ కేబుల్ టీవీ చట్టానికి లోబడే ప్రసారాలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్ని రాష్ట్రప్రభుత్వాలకూ లేఖలు రాశారు.
ఉల్లంఘనల మీద చర్యలు తీసుకోవటానికి జిల్లా కలెక్టర్లకు, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్లకు అధికారాలు కల్పిస్తూ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని ఆ లేఖలో గుర్తుచేశారు. ముందుగా మానిటరింగ్ కమిటీలను ఏర్పాటుచేస్తే తప్ప కేబుల్ టీవీ చట్టం లోని నిబంధనలను అమలుచేయటం సాధ్యం కాదన్నారు.  ఆ కమిటీల సిఫార్సులమేరకు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని  మంత్రి కోరారు.
ఇలా ఉండగా, స్థానిక కేబుల్ చానల్స్ ను నియంత్రించేందుకు వీలుగా టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) ఇప్పటికే ఒక చర్చా పత్రాన్ని విడుదలచేసి అభిప్రాయాలు సేకరించింది. ఈ చానల్స్ లో ఎలాంటి కార్యక్రమాలు ప్రసారం చేయాలి, వాటికి అర్హతలు ఎలా నిర్ణయించాలి,  అనుమతుల మంజూరు విధానం ఎలా ఉండాలి, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలన్నిటినీ చర్చా పత్రంలో చేర్చారు., మొత్తానికి వీటిని నియంత్రించే దిశలో ప్రభుత్వం ఆలోచిస్తోంది

March 31..