తన వార్తా ప్రసారాలతో అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ముచ్చెమటలు పట్టించిన టీవీ9 నేడు తమ ప్రసారాలకు క్షమాపణలు చెబుతున్నామని తెలంగాణ ఎంఎస్ఓల సంఘానికి లేఖ రాసింది.
తెలంగాణ ప్రజా ప్రతినిధులను కించపరుస్తూ టీవీ9 ఛానల్ ‘బుల్లెట్’ న్యూస్ ప్రసారం చేసిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ఆ ఛానల్ మీద తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దానితో పాటు ఆంధ్రజ్యోతి పత్రిక మీద కూడా విమర్శలు చేశారు. తెలంగాణ శాసనసభ ఈ ఛానళ్ల మీద చర్యను శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ లకు అప్పగించింది. ఇక కేసీఆర్ కు మద్దతుగా తెలంగాణలో ఈ రెండు ఛానళ్లను తెలంగాణ ఎంఎస్ఓలు నిలిపివేశారు.
దీంతో ఈ విషయం కోర్టుకు వెళ్లింది. కోర్టు ఎంఎస్ఓల మీద చర్యలు తీసుకోలేమని తేల్చిచెప్పింది. రాజ్యసభలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేంద్రం ఎంఎస్ఓలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినా ఎంఎస్ఓలు ఈ ఛానళ్ల ప్రసారానికి ఏ మాత్రం మొగ్గు చూపలేదు. కేంద్రం వీరి మీద నేరుగా ఎలాంటి చర్యలు తీసుకునే హక్కు లేని నేపథ్యంలో వారు కేంద్రం ఆదేశాలను పట్టించుకోలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా టీవీ9 యాజమాన్యం తెలంగాణ ఎంఎస్ఓలకు షరతులు లేని క్షమాపణలు చెబుతూ సంఘానికి లేఖ రాసింది. తమ ప్రసారాలకు తాము క్షమాపణలు చెబుతున్నామని, అప్పటి నుండి తమ ఛానల్ లో ఆ బుల్లెట్ న్యూస్ బులెటిన్ ను కూడా ఎత్తేశామని స్పష్టం చేసింది. ఇక ముందు కూడా అలాంటి సంఘటనలు జరగవని హామీ ఇస్తున్నామని, తమ ఛానల్ ప్రసారాలను పునరుద్దరించాలని కోరారు.
ముఖ్యంగా టీవీ9 తెలుగు ఛానల్ ఆ గ్రూపు ప్రధాన ఆదాయ వనరు. దానికి తోడు ఇప్పుడు ఆ గ్రూపు వాటాలను విక్రయించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కీలక చర్చలు పూర్తయిన దశలో తెలంగాణ ఎంఎస్ఓలు ఆ ఛానల్ ప్రసారాలను నిలిపివేయడంతో ఆ ఛానల్ మీద తీవ్ర ప్రభావం చూపిందని, వాటాలు కొనేందుకు ముందుకు వచ్చిన సంస్థలు ఈ పరిణామాలతో ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. అందుకే టీవీ 9 యాజమాన్యం క్షమాపణల లేఖ రాసినట్లు తెలుస్తోంది.
