Sunday, 31 August 2014

తెలుగు గుండెపై తీయని ముద్ర " బాపు బొమ్మ "



బాపు బొమ్మ గీస్తే అందమైన రూపం
బాపు బొమ్మ తీస్తే అందమైన దృశ్యం!
ఆయన చేతిలో కుంచె ఎన్ని వయ్యారాలు పోయిందో...
ఆయన చేతిలో బొమ్మ ఎన్ని సొగసులు అద్దుకుందో!
చిత్రకారుడిగా ... చలనచిత్రకారుడిగా బాపూ తెలుగు గుండెపై తీయని ముద్రయ్యాడు.
నాటి 'సాక్షి' నుంచి నిన్నటి 'శ్రీరామ రాజ్యం' వరకు తెలుగుజాతికి తరగని కళాత్మక ఆస్తిని పంచాడు.
ముఖ్యంగా తెలుగుతెరకు కొత్త పాఠాలు నేర్పాడు.
సినిమాలోని బ్లాకులను పెయింటింగులుగా తీర్చిదిద్దాడు.
ప్రతి పాత్రనూ మన మధ్య మసలే వ్యక్తులుగా భ్రమింపజేశాడు.
పదహారణాల తెలుగుదనం అంటే ఏమిటో రుచి చూపించాడు.
పల్లెటూరి అమాయకులు ఎలా ఉంటారో చూపించాడు ...
తేనెపూసిన కత్తులు ఎలా ఉంటాయో చూపించాడు ...
బంధాలు ... అనుబంధాలు ... ప్రేమలు, ఆప్యాయతలు ... వెన్నుపోట్లు ఎలా ఉంటాయో అవీ చూపించాడు.
పురుషోత్తముడు ఎలా ఉంటాడో ... మాహా సాధ్వి సీతమ్మ ఎలా వుంటుందో ...
కర్కోటకుడు రావణాసురుడు ఎలా ఉంటాడో ... భక్త హనుమ ఎలా ఉంటాడో, భక్త కన్నప్ప ఎలా ఉంటాడో మన కళ్ళకు కట్టాడు.
మన ముంగిట ముత్యాలముగ్గులు వేశాడు ... మనవూరి పాండవులను, బుద్ధిమంతుడిని, అందాలరాముడిని, మిస్టర్ పెళ్లాంను, రాధా గోపాళాన్ని... వెండితెరపై ఆవిష్కరించాడు.
ఎవరూ చెప్పక్కర్లేకుండానే 'ఇది బాపూ బొమ్మ...' అని చెప్పేయగలిగేలా తన స్టాంప్ గట్టిగా కొట్టాడు.
మిత్రుడు రమణతో కలసి వెండితెరను స్వర్ణతెరగా మార్చేశాడు!
బాపూ రమణలు విడివడి పుట్టిన కవలలు లాంటివారు.
ఇప్పుడు ఇద్దరూ బౌతికంగా మన మధ్య లేకపోయినా, తెలుగు సినిమా ఉన్నంతవరకు వీరిద్దరూ జీవించే వుంటారు ... ప్రేక్షకుల హృదయాలలో! 

March 31..